కశ్మీర్లో టాప్ 10 ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల పేర్లతో ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిని భద్రతా సంస్థలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ జాబితాకు సంబంధించి మూలాలపై ఎవరికీ స్పష్టత లేదు.
కశ్మీర్ లోయలో మూడు భద్రతా సంస్థలు కీలకంగా పనిచేస్తాయి. ఇవి సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసు విభాగం. వీటిలో ఏ సంస్థ కూడా జాబితాను అధికారికంగా విడుదల చేయలేదని స్పష్టం చేశాయి.
పాక్ పనేనా!
ఇది పాకిస్థాన్‌కు చెందిన పనిగా పలువురు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు అతిగా ప్రచారం కల్పించి, వారికి ప్రజల్లో లేని ఆదరణను పెంచేందుకే పాక్ నిఘా సంస్థ-ఐఎస్ఐ కుట్ర పన్ని ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై ఈటీవీ భారత్ ప్రతినిధితో ఓ భద్రతా అధికారి మాట్లాడారు.
"దేశంలోని ఏ భద్రతా సంస్థ దీన్ని జారీ చేయకపోతే.. ఇది కచ్చితంగా సరిహద్దు ఆవల నుంచి వచ్చినదే. అదే నిజమైతే.. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ లేదా దాని అనుబంధ సంస్థల పనే ఇది."
- భద్రతా అధికారి
ఇలా చేయటం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అధికారి అనుమానించారు. ఉగ్రవాదుల్లో క్రియాశీలకంగా ఉన్నవారిని గానీ.. ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారిని గానీ పేర్లను బహిర్గతం చేయవద్దని ఇటీవల భారత ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రాచుర్యం కల్పించవద్దని తెలిపింది. ఈ వ్యూహాన్ని దెబ్బతీసేందుకే ఈ పని చేసి ఉంటారని ఆయన అన్నారు.
"ఈ చర్య చనిపోయిన లేదా క్రియాశీలకంగా ఉగ్రవాదులకు ప్రచారం కల్పించే లక్ష్యంతోనే చేసింది. ఫలితంగా వారిపై సానుభూతి ఏర్పడి అమాయకులు తుపాకులు పట్టుకునేలా ప్రోత్సహించేందుకే ఈ కుట్ర. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో ఉద్వేగానికి లోనయ్యే యువతకు వల వేస్తారు. 2016 జులై 9న బుర్హన్ వనీ హతమైనప్పుడు ఇదే జరిగింది. చాలా మంది యువత ఉగ్రవాదం వైపు మళ్లారు. "