వారం రోజుల వ్యవధిలో పాక్ దౌత్యాధికారికి రెండోసారి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈనెల 14న కాల్పుల విరమణ ఉల్లంఘన, కశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదులు దాడి చేసిన వ్యవహారంపై పాక్ దౌత్యవేత్తను పిలిపించిన విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దు ఉగ్రవాదం పాకిస్థాన్‌లో బలంగా ఉందన్న విదేశాంగ శాఖ.. వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
నగ్రోటా ఘటనలో జైషే మహమ్మద్ ప్రమేయం ఉన్నట్లు తెలిపిన భారత్.. అందుకు సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్ దౌత్యవేత్తకు అందించింది. నగ్రోటా ఎన్‌కౌంటర్‌లో లభించిన శాటిలైట్ ఫోన్ల సందేశాలను చూపింది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పథకం ప్రకారం కశ్మీర్‌లో చేసిన దాడిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఉగ్రసంస్థను.. ఐక్యరాజ్యసమితి నిషేధించిన విషయాన్ని ప్రస్తావించిన విదేశాంగ శాఖ.. భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపింది. దాడుల్లో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు, మందుగుండు సామాగ్రి ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోందని వివరించింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ఇలాంటి పథకాలు రచించి, దాడులకు పాల్పడుతోందని భారత్ నిరసన వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ తమ భూభాగం నుంచి ఉగ్రవాదులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది విదేశాంగ శాఖ.