ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్ న్యూస్ ప్రొడ్యూసర్ షెన్ సీవే ట్విట్టర్‌లో ఒక వీడియోను పంచుకొన్నాడు. 52 క్షణాల నిడివి ఉన్న ఈ వీడియోలో 0.05 సెకన్ల వద్ద ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఏమాత్రం చైనీయుడులాలేడు. గడ్డం పెంచుకొని పొడవుగా భిన్నంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరూ అనే విషయాన్ని మాత్రం షెన్ ప్రస్తావించలేదు. ఈ వీడియోను విశ్లేషించిన సైనిక నిపుణులు మాత్రం ఆ వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీలోని ఎస్‌ఎస్‌జీ కమాండో అని చెబుతున్నారు.
ఎప్పటి నుంచో పాక్ సాయం..
భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనా-పాక్‌లు ఎప్పటి నుంచో పరస్పరం సాయం చేసుకొంటున్నాయి. గత ఏడాది గిల్గిట్ బాల్టిస్థాన్‌లోని స్కర్థూ ఎయిర్‌బేస్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఇటీవల జూన్‌లో అక్కడ ఒక ఐఎల్78 ట్యాంకర్ విమానం కనిపించింది. చైనాకు చెందిన ఎయిర్ రిఫ్యూలర్ విమానంగా దీనిని గుర్తించారు. దీంతో ఈ రెండు దేశాలు ఏ స్థాయిలో పరస్పరం సహకరించుకొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
జూన్‌లో చైనాకు చెందిన హాంగ్ గుజి అనే సైనిక నిపుణుడు మోడర్న్ వెపనరీ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. దీనిలో భారత్ పర్వత యోధుల శక్తిని చెప్పుకొచ్చాడు. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు వేటిల్లోనూ భారత్ అంత శక్తిమంతమైన మౌంటేన్ వార్ఫేర్ బృందం లేదని పేర్కొన్నారు. భారత్ సియాచిన్ గ్లేషియర్‌లో తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. ఈ అనుభవం భారత్‌కు అక్కరకొస్తోంది. ఇదే కారణంతో భారత పర్వత యోధులను ఎదుర్కొనేందుకు పాక్‌ను సాయం కోరినట్లు భావిస్తున్నారు.
తాజాగా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళాలు స్పంగూర్ వద్ద చైనాకు షాకివ్వడంతో పీఎల్‌ఏలో ఆందోళన పెరిగిపోయింది. దీంతో పాక్ దళాలను కూడా పిలిపించి ఉండవచ్చు. పాక్ దళాలకు భారత సైన్యాన్ని సియాచిన్ వంటి చోట్ల ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఇప్పుడు ఈ అనుభవాన్ని చైనా వాడుకోవాలని చూస్తోంది.