తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వేళ దేశంలోకి భారీగా పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్. కశ్మీర్ లోయ, ఇతర ప్రాంతాల్లో వారు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ దిల్బాగ్ సింగ్.
" కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటికీ.. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లకు పాల్పడుతోంది పాకిస్థాన్. అలాంటి ప్రయత్నాలను నిరోధించేందుకు నిఘా పెంచాం. కశ్మీర్ లోయలో హింస సృష్టించేందుకు 300 మందికిపైగా తీవ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచింగ్ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారు. లద్దాఖ్‌లో పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌తో సరిహద్దుల వెంబడి అదనపు శ్రద్ధ అవసరం. కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు చేతులు కలిపినట్లు నిఘావర్గాల సమాచారం ఉంది."