పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పుంఛ్, కథువా జిల్లాల్లోని గ్రామాలు సహా.. నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. పాక్ చర్యలను భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని వారు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు.
తొలుత శనివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి.. దాయాది సైన్యం కాల్పులకు తెగబడినట్టు వెల్లడించారు అధికారులు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కస్బా, కిర్నీ సెక్టార్ ప్రాంతాలపై దాడులు చేసిందన్నారు. కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌లోని జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, ఫార్వర్డ్ పోస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్టు సమాచారం.