దేశం కోసం ప్రాణాలర్పించిన 122 మంది అమరవీరుల కుటుంబాలతో గుజరాత్‌లోని సూరత్‌లో సమావేశమయ్యారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ చరమగీతం పాడకపోతే ఆ దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తుందన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో 2 రోజుల క్రితం పర్యటించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు రాజ్‌నాథ్. ఇమ్రాన్ చెప్పినట్లు పాక్ నుంచి ఎవరూ నియంత్రణ రేఖ దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. సరిహద్దులు దాటిన వారిని భారత సైన్యం తిరిగి వెనక్కి పంపబోదని స్పష్టం చేశారు.
"పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతోంది. ఆ దేశంలో అల్పసంఖ్యాక ప్రజలకు రక్షణ లేదు. దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో అల్పసంఖ్యాకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు అత్యంత సురక్షిత దేశం భారత్. దేశ విభజన సమయంలో ఉన్న మైనార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతుందంటే అది పాకిస్థాన్‌లోనే. దాయాది దేశంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ దేశం ముక్కలుముక్కలు అవుతుంది."