పాకిస్థాన్ దళాలు జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఏడాది 3,800 సార్లకు పైగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. డ్రోన్లు, క్వాడ్కాఫ్టర్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను.. పాక్ అక్రమ రవాణా చేసిందని తెలిపింది.
ఉగ్రవాదుల చొరబాట్లకు మద్దతుగా పౌర ప్రాంతాల్లోనూ పాక్ సైన్యం కాల్పులు చేసిందని విదేశాంగ కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ వేర్కొన్నారు.
"ఇరుపక్షాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దానికి తూట్లు పొడుస్తూ ఏడాది కాలంలో పాకిస్థాన్ దళాలు 3,800 కన్నా ఎక్కువ సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సీమాంతర ఉగ్రవాదానికి సహకారం అందించిన సంఘటనలు గుర్తించాం. ఆయుధాలు, మత్తు పదార్థాలను అంతర్జాతీయ సరిహద్దు ద్వారా దేశంలోకి పాకిస్థాన్ తరలిస్తోంది. ఇందుకు డ్రోన్లు, క్వాడ్కాఫ్టర్లను వినియోగిస్తోంది."
-అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతిసారి దౌత్య, సైనిక స్థాయిలో ఈ విషయంపై చర్చలు జరిగినట్లు అనురాగ్ వెల్లడించారు.
'బ్లాక్'లిస్ట్‌పై
పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్ట్‌లో చేర్చే అంశంపై స్పందించారు శ్రీవాస్తవ. దీనికి ఆ సంస్థ సరైన ప్రమాణాలు నిర్దేశించిందని అన్నారు. 27 అంశాలున్న ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికలో.. పాక్ 21 అంశాలను మాత్రమే నెరవేర్చిందని, ముఖ్యమైన 6 విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
"ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంగా ఉందని అందరికీ తెలుసు. ఐరాస భద్రత మండలి నిషేధం విధించిన మసూద్ అజహర్, దావూద్ ఇబ్రహీం, జాకీర్ రెహ్మాన్ వంటి వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు."
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి
2018 జూన్‌లో పాకిస్థాన్‌ను 'గ్రే' లిస్ట్‌లో చేర్చుతూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించడంలో విఫలమవుతూ అప్పటి నుంచి పాకిస్థాన్ అదే జాబితాలో కొనసాగుతోంది. గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే 12 ఓట్లు(మొత్తం 39 ఓట్లు) సాధించాల్సి ఉంటుంది. చైనా, టర్కీ, మలేసియా దేశాలు పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చకుండా అడ్డుపడుతున్నాయి.
ఇదీ చదవండి-పాక్‌కు ఎఫ్ఏటీఎఫ్ చిక్కు- 'గ్రే' లిస్ట్‌లోనే కొనసాగింపు!