ఓవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన ప్రవృత్తి మార్చుకోవడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పులకు తెగబడుతూ.. ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది. గడిచిన 8 నెలల్లో(జనవరి- సెప్టెంబర్ 7 వరకు) జమ్మూలో పాక్ సైన్యం ఏకంగా 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటికి తోడు జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 242 సార్లు సీమాంతర(క్రాస్ బార్డర్) కాల్పులు జరిగినట్లు రాజ్యసభకు తెలిపింది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వరకు ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఈ కాల్పుల్లో మరణించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.