భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను కనిష్ఠ స్థాయికి దిగజారుస్తూ దాయాది పాక్ నిర్ణయించడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను భయంకరంగా చిత్రించి ప్రపంచం ముందు ఉంచడానికి పాక్ విఫలయత్నం చేస్తోందని మండిపడింది.
భారత రాజ్యాంగం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ దేశ సార్వభౌమాధికార అంశమేనని విదేశాంగశాఖ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. ఈ విషయంలో అనవసర జోక్యం వద్దని, ఇలాంటి ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావని దాయాదికి హితవు పలికింది.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గిస్తూ బుధవారం పాక్ చేసిన ప్రకటనపై విదేశాంగ మంత్రిత్వశాఖ విచారం వ్యక్తం చేసింది. సాధారణ మాధ్యమాల ద్వారా ద్వైపాక్షిక సమాచార మార్పిడి కొనసాగేలా చర్యలు చేపట్టాలని దాయాదికి సూచించింది.