చైనా సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో క్షిపణి స్థావరాలను ఏర్పాటు చేస్తోంది పాకిస్థాన్. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే క్షిపణుల కోసం వివాదాస్పద ప్రాంతంలో ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది.
భారత సరిహద్దులో చైనా-పాకిస్థాన్ కలిసి అదనపు సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. అక్కడి నుంచి భారత్‌వైపు నిఘా పెడుతున్నట్లు వెల్లడించారు. పీఓకే లసాదాన్నా ధోక్ సమీపంలోని పౌలి పీర్ ప్రాంతంలో క్షిపణి స్థావరం కోసం నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు.
"పీఓకేలోని జురా, దియోలియాన్ ఫార్వర్డ్ ప్రాంతాల్లో పాక్ సైన్యంతో కలిసి చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) నిఘా కార్యకలాపాలలో పాల్గొంది. 'ఫోర్స్ కమాండర్ నార్తర్న్ ఏరియా'(పాక్ డివిజన్ స్థాయి సైన్యం) ఆధ్వర్యంలో పాకిస్థాన్ సైన్యంతో కలిసి చైనా దళాలు కనిపించాయి.
దాదాపు 120 మంది పాకిస్థాన్ సైనికులు, 25-40 మంది పౌరులు నిర్మాణ(క్షిపణి స్థావరం) స్థలం వద్ద కనిపించారు. దీని కంట్రోల్ రూం వ్యవస్థ పీఓకే ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. పది మంది పీఎల్ఏ సైనికులు, ముగ్గురు అధికారులను కంట్రోల్ రూంలో నియమిస్తారు."