"దేవుడి దయ వల్ల నేను నాటు వైద్యం చేస్తున్నాను. కుక్కకాటు, ఇతర వ్యాధులు తగ్గించేందుకు నేను నూనె తయారు చేస్తాను. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. కానీ, నేను ఎవరినీ అడగను. కేవలం ప్రజల ప్రేమ, దేవుడి దయ వల్లే నేను బతుకుబండి నడిపిస్తున్నాను. ఎలా బతుకుతున్నామనేది పక్కన పెడితే బతుకుతున్నాము చాలు"..... కడు పేదరికాన్ని అనుభవిస్తున్నా బాధను దిగమింగి.. చిరునవ్వుతో పద్మశ్రీ సిమోన్ ఉరావ్ చెప్పిన మాటలివి!
పద్మశ్రీ అవార్డు గ్రహీత సిమోన్ ఉరావ్ స్వస్థలం ఝార్ఖండ్ రాంచీకి సమీపంలోని ఖక్సీ టోలీ గ్రామం. ఆయన జల పురుషుడిగా అందరికీ సుపరిచితులే. నీరు, వనం, నేలను కాపాడుకునేందుకు ఆయన చేసిన కృషికి యావత్ ప్రపంచం సలాం చేసింది. రైతు, సమాజ అభ్యుదయం కోసం అంతలా పోరాడిన ఆయన్ను.. ఎన్నో పురస్కారాలు, ఇంకెన్నో ప్రశంసా పత్రాలు వరించాయి. కానీ, ఇప్పుడు ఆయన కనీసం మనవరాళ్లను చదివించుకునే స్తోమత లేని స్థితిలో ఉన్నారు. పొట్టకూటి కోసం 83 ఏళ్ల వయసులోనూ నాటు వైద్యం చేస్తూ బతుకీడుస్తున్నారు.
దేశం గర్వించే వ్యక్తిత్వం...
సిమోన్ వర్షపు నీటిని ఒడిసిపట్టి వాటితో వ్యవసాయం చేయడమే కాక... భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులు, బావులు తవ్వించారు. అందుకే ఆయన్ను జల పురుషుడు అని పిలుస్తారు. వన సురక్షా సమితి, భూ సంరక్షణ సమితి ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు.