లక్షల కోట్ల బంగారు, వజ్రాలు, రత్నాలు, మరెన్నో అమూల్యమైన ఆభరణాలతో పాటు వెలకట్టలేని సంపద కలిగిన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్ రాజవంశీయులదేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన అరుదైన నిధులు కలిగిన నేలమాళిగ 'బి'ని ఇంక తెరిచే అవకాశం లేనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.
గతంలో తెరిచారా?
2014లో మాజీ సీఏజీ వినోద్‌రాయ్ నేతృత్వంలో ఒక ఉన్నత కమిటీ నియమితమైంది. ఈ కమిటీ తన నివేదికలో 1990లో రెండుసార్లు 2002లో ఐదుసార్లు ఈ గదిని తెరిచినట్టు తన నివేదికలో పేర్కొంది. వెండి వస్తువులను తీసుకొని బంగారు పాత్రలను అందులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ నివేదికను సుప్రీంకోర్టులో అమికస్ క్యూరీ సమర్పించారు. ఈ గదిని తెరిచే అంశమై వినోద్‌రాయ్ రాజకుటుంబీకులతో కూడా చర్చించారు.
'తెరవలేదు..'
అయితే గతంలో ఈ గదిని తెరిచినట్టు వచ్చిన వార్తలను రాజకుటుంబీకులు ఖండించారు. వాస్తురీతిలో బి గది నిర్మాణం విలక్షణమైనదని బి గదిలో రెండు విభాగాలున్నాయని మొదటిది భారతకొనె కల్లార అని రెండవది శ్రీపండరా కల్లారా అని వారు వెల్లడించారు. మొదట విభాగాన్ని మాత్రమే తెరచారని ప్రధాన విభాగంలోకి ప్రవేశించలేదని వారు స్పష్టం చేశారు.
దేవ ప్రసన్నం..
ఈ గదిని తెరవాలా వద్దా అని తెలుసుకునేందుకు భగవంతుని అభీష్టం తెలుసుకునేందుకు దేవప్రసన్నం అనే కార్యక్రమాన్ని 2011లో నిర్వహించారు. అయితే ఆ గదిని తెరవకూడదన్నది దేవుని అభిమతమని వారు తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆలయ నిర్వహణ పూర్తి బాధ్యతలు రాజవంశీయులకు అప్పగించడం వల్ల నేలమాళిగ తెరవడంపై ఉత్కంఠ నెలకొంది. రాజవంశీయులు మాత్రం తమ పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలనే కొనసాగించే అవకాశముంది.
ఇదీ చూడండి:ఆవుతో ఎద్దు 'ప్రేమాయణం'.. కానీ...