ఆక్ప్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు యాంటీబాడీలను, టీ కణాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని సోమవారమే వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితం కావడమే కాక రోగ నిరధక శక్తిని ప్రతిస్పందింపజేస్తోందని లాన్సెట్ తెలిపిన మరునాడే ప్రశంసలు కురిపించారు పలువురు శాస్త్రజ్ఞులు. కీలక పురోగతి సాధించారని కొనియాడారు.
తొలి దశ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా 18నుంచి 55ఏళ్ల మధ్య వయసున్న 1077 మంది ఆరోగ్యవంతులపై ఈ ప్రయోగాన్ని జరిపారు ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు. వారిలో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని చెప్పారు.
వ్యాక్సిన్ యాంటీబాడీలు, టీ కణాలు రెండింటినీ ఉత్పత్తి చేయడం ఆదర్శనీయమన్నారు ప్రముఖ వైరాలజిస్ట్ ఉపాసనా రాయ్. సమర్థవంతమైన రోగనిరోధక శక్తికి, దీర్ఘకాలిక రక్షణకు ఈ రెండు అవసరమని చెప్పారు.
ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని లండన్ శాస్త్రవేత్త, పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ అండ్ డైరెక్టర్ ఆఫ్ వ్యాక్సిన్ సెంటర్ బీటే క్యాంప్మాన్ తెలిపారు.
ఇంకా చాలా దూరం..
అయితే భారత్, ఇతర దేశాల్లోని పలువురు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రయోగంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19పై ఇది ఏ మేర ప్రభావం చూపుతుందో ఇంకా నిర్ధరించాల్సి ఉందన్నారు. వైరస్ సోకిన వ్యక్తులపై ప్రయోగాలు జరిపిన తర్వాతే ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమనే విషయంపై స్పష్టత వస్తుందని ఉపాసనా రాయ్ అన్నారు.
'టీ కణాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కానీ అవి క్రియాత్మక రక్షణకు సంబంధించినవా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరిన్ని ట్రయల్స్ నిర్వహించాకే వాటి సామర్థ్యం తెలుస్తుంది' అని దిల్లీలోని ఎన్ఐఐ ఇమ్యునాలజిస్ట్ సత్యజిత్ రథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ అభివృద్ధిని పలు దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశ ట్రయల్స్ చాలా తక్కువ మందిపై నిర్వహిస్తారు. వ్యాక్సిన్ సురక్షితమా కాదా అని పరీక్షిస్తారు. రెండో దశలో వేలాది మందిపై నిర్వహించే ట్రయల్స్ ద్వారా వ్యాక్సిన్ శక్తి సామర్థ్యాలపై స్పష్టత వస్తుంది. చివరి దశలో వ్యాక్సిన్ సుదీర్ఘ కాలం రక్షణ ఇస్తుందో లేదో తెలుస్తుంది.
ఈ ఏడాది చివరి నాటికి..
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమని తెలుస్తోంది. భారీ దుష్ప్రభావాలేమీ కనిపించలేదు. అయితే 70% మందికి స్వల్పంగా జ్వరం లేదా తలనొప్పి వచ్చింది. కొద్ది మందిలో తిమ్మిర్లు, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే పారాసిటమాల్‌తో ఇవన్నీ తగ్గిపోయాయి. టీకా పూర్తి పనితీరును తెలుసుకొనేందుకు తర్వాతి దశలో బ్రిటన్‌లో 10వేలు, అమెరికాలో 30వేలు, దక్షిణాఫ్రికాలో 2000, బ్రెజిల్‌లో 5000 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: దద్దుర్లు కూడా కరోనా లక్షణమే!