ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వల్లే బిహార్‌లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్. ఒవైసీ సారథ్యంలోని పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను చీల్చి మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఫలితంగా ఎన్డీఏకు మేలు చేశారని చెప్పారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఏఐఎంఐఎం బిహార్‌లో గెలిచిన ఐదు స్థానాల్లో గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచాయని పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా ఐదు స్థానాలు కైవసం చేసుకుంది అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం. ఆ రాష్ట్రంలో గతంలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. ఆర్ఎల్ఎస్పీ, బీఎస్పీ సహా ఇతర చిన్న పార్టీలను కలుపుకొని గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన ఏఐఎంఐఎం.. 22స్థానాల్లో బరిలోకి దిగి ఆశించిన ఫలితాలు సాధించింది. ఫలితంగా కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది.
ఏఐఎంఐఎం గెలిచిన కోచాదామన్, జోకిహత్, బైసీ, బహదుర్గంజ్, అమౌర్ స్థానాల్లో గతంలో ఎప్పుడూ కాంగ్రెస్, ఆర్జేడీకి అనుకూలంగా విజయావకాశాలు ఉండేవి. పలుమార్లు జేడీయూ కూడా ఇక్కడ గెలిచింది. కానీ ఈసారి అందరికీ షాక్ ఇస్తూ ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. ఇతర స్థానాల్లోనూ ముస్లిం, దళితుల ఓట్లను చీల్చి ఆర్జేడీ, కాంగ్రెస్‌ను దెబ్బతీసింది.