71వ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అట్టహాసంగా సాగింది. దిల్లీ రాజ్‌పథ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సొనారో హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేత అడ్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్, వివిధ పార్టీల అగ్రనేతలు గణతంత్ర దినోత్సవంలో పాలొన్నారు. వేలాది మంది ప్రజలు రాజ్‌పథ్‌కు తరలి వచ్చారు.
సైనిక సంపత్తి...
భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ సైనికులు భారీ కవాతు నిర్వహించారు. త్రివర్ణ జెండాకు వందనం చేస్తూ ముందుకు సాగారు. వజ్ర, భీష్మ యుద్ధ ట్యాంకులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. రుద్ర హెలికాప్టర్ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఐఎన్ఎస్ విక్రాంత్' విమాన వాహకనౌక నమూనాను నౌకదళం ప్రదర్శించింది. డీఆర్డీఓకు చెందిన భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి 'ఏ-సాట్' ఆయుధ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయుధ వ్యవస్థ 'ధనుశ్'ను తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు.