ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తప్పని సరి పరిస్థితుల్లోనే దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకు తనను క్షమించాలని 'మనసులో మాట' వేదికగా కోరారు. ప్రజలు తమను తాము రక్షించుకుంటూ తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవాలనే లాక్‌డౌన్ విధించామన్న ప్రధాని.. మరికొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటరాదన్నారు.
దేశ ప్రజలందరినీ నేను క్షమాపణలు కోరుతున్నా. మేము తీసుకున్న నిర్ణయాల కారణంగా మీరంతా.. కఠినమైన ఆంక్షలు ఎదుర్కొవాల్సి వస్తోంది. నేను పేద ప్రజలను చూస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో పడేశారు, ఈయనేం ప్రధానమంత్రి అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. వారందరినీ నేను క్షమాపణలు కోరుతున్నా. కొంతమందికి నాపై కోపం కూడా ఉంటుంది. మీ పరిస్థితి, మీ ఆందోళన నాకు అర్థమవుతోంది. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లాంటి దేశానికి కరోనాపై పోరాటంలో ఈ అడుగేయడం ( లాక్‌డౌన్) మినహా మరో మార్గం లేదు. కరోనాపై జరిపే యుద్ధం జీవన్మరణ పోరాటం. ఈ పోరాటంలో తప్పక గెలుస్తాం. అందుకోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది గమనించిన తర్వాత.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేందుకు ఈ ఒక్క దారే కనిపించింది.
---నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.