దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 606మంది వైరస్ బారిన పడగా.. ఇవాళ ఆ సంఖ్య 694కి పెరిగింది. ఇప్పటివరకు 16మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రాష్ట్రాల వారీగా పరిస్థితి ఇలా..
కేరళలో ఇవాళ 19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 126కు చేరింది. 1.20లక్షల మందిని పరిశీలనలో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం.
మహారాష్ట్రలోనూ కరోనా ప్రభావం అధికంగా ఉంది. తాజాగా మరో ముగ్గురు వైరస్ బారిన పడగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో చికిత్స పొందుతున్న ఓ 65ఏళ్ల వృద్ధురాలు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. వైరస్ పాజిటివ్‌గా తేలినప్పటికీ... మృతిచెందడానికి గల కారణాలను పరిశీలిస్తునట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
21రోజుల లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. నిబంధనల ఉల్లంఘన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరకుల షాపులను 24 గంటలు తెరిచేందుకు అనుమతిచ్చింది.
మహమ్మారికి ధాటికి గుజరాత్లో 70 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అతడితో కలిపి మొత్తం ముగ్గురు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు వైరస్ బారిన పడగా... మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది.
కర్ణాటకలో మరో మహిళ మరణించినట్లు ప్రకటించారు అధికారులు. మృతురాలు ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కారణంగా ఒకరు మరణించగా.. ఇది రెండో మరణం. 41 మందికి వైరస్ సోకగా.. ముగ్గురు కోలుకున్నారు.
రాజస్థాన్‌లోని బిల్వారాలో 73ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఆయన చికిత్స పొందిన ఆసుపత్రిలో కొందరు వైద్యులు, నర్సులూ వైరస్ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 40 మందికి వైరస్ సోకింది.
జమ్ముకశ్మీర్, తెలంగాణ, దిల్లీ, బిహార్, గోవాలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది.