అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ సహాయ నిధి కింద కేటాయించిన రూ.881కోట్ల నిధిని బాధితులకు అందివ్వకపోవటంపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) మండిపడింది.
ఈ నిధిని రసాయన కర్మాగారాలు, హానికారక పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రమాదం జరిగితే వారికి అందించేందుకు కేంద్రం కేటాయించిందని ఎన్జీటీ గుర్తుచేసింది. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలతో కార్మికులు గాయాలపాలవుతున్నా ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.
" 2020 మార్చి 31నాటికి పర్యావరణ సహాయ నిధి ఖాతాలో రూ.881కోట్లు డిపాజిట్ అయ్యాయి. వీటిని ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. ఇంత అధిక మొత్తంలో నిధులు ఉన్నా బాధితులకు అందలేదు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి సహాయంగా ఉండాలని కేంద్ర , రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీలను కోరుతున్నాం."
---జాతీయ హరిత ట్రైబ్యునల్.
పర్యావరణ నిధిని బాధితులకు ఇవ్వటం లేదంటూ విశ్రాంత ప్రభుత్వ అధికారి జ్ఞాన్ ప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎన్జీటీ ఈ వ్యాఖ్యలు చేసింది. నిధిని ఉపయోగించకపోతే పబ్లిక్ లియాబిలిటీస్ ఇన్సురెన్సు యాక్ట్-1991కి అర్థం లేదని పిటిషనర్ వివరించారు. బాధితులకు సహాయం అందించటంలో సంబంధిత కలెక్టర్లు సైతం జాప్యం చేస్తున్నారని తెలిపారు.