దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్ లిస్ట్ ఉండే టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావడమే ఇందుకు కారణం. ఈ విధంగా 2019-2020లో మొత్తం 84,61,204 ప్యాసింజర్ నేమ్ రికార్డు (పీఎన్‌ఆర్) నంబర్లు కలిగిన 1.25 కోట్ల మంది ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఐదేళ్లలో 5 కోట్లు
వెయిట్‌లిస్ట్ కారణంగా ఐదేళ్లలో సుమారు 5కోట్ల పీఎన్ఆర్లు ఆటోమేటిక్‌గా రద్దైనట్టు తెలిపింది రైల్వేశాఖ. 2014-15లో 1.13కోట్లు; 2015-16లో 81.05 లక్షలు; 2016-17లో 72.13 లక్షలు; 2017-18లో 73.02 లక్షలు; 2018-19లో 68.97 లక్షల పీఎన్ఆర్లు రద్దయ్యాయని పేర్కొంది.