పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ) వల్ల అసోంలో గరిష్ఠంగా 5 లక్షల 42వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. జాతీయ పౌర పట్టిక ఆధారంగా అసోం ప్రభుత్వ అంచనా ప్రకారం 5లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సీసీఏ ద్వారా లాభం చేకూరుతుందని తెలిపారు. పౌరచట్టం వల్ల కోటి మందిపైగా లాభపడతారని, బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరిగిపోతాయని.. కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసోంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్, క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితిలే కారణమని ఆరోపించారు.
ఉదయం 6 నుంచి ఆంక్షలు ఎత్తివేత
గువాహటిలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ తొలగిస్తున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబరు 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బ్రాడ్‌బాండ్ అంతర్జాల సేవలను కూడా మంగళవారం ఉదయమే పునరుద్ధరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు.
సీసీఏపై సుప్రీంలో వ్యాజ్యాలు
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 13నే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. జైరాం వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై సీపీఎం ఇవాళ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలున్నాయి.