కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు మే 7న వందే భారత్ మిషన్ను ప్రారంభించింది కేంద్రం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3 లక్షల 64 వేల 209 మందిని వివిధ దేశాల నుంచి భారత్కు తరలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
స్వదేశం వచ్చేందుకు మొత్తం 5 లక్షల 13 వేల 47 మంది నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు. త్వరలోనే మిగతావారిని కూడా భారత్కు తీసుకురానున్నట్లు చెప్పారు. సరిహద్దు చెక్పాయింట్ల ద్వారా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి 84,000 మందికిపైగా భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
" వందే భారత్ మిషన్ మొదటి మూడు విడతల్లో 875 విమానాల ద్వారా 50 దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాం. ఇప్పటివరకు 700 విమానాల్లో లక్షా 50 వేల మంది భారత్కు వచ్చారు. మూడో విడతలో మిగతా 175 విమానాలు భారతీయులను తరలిస్తాయి. మిగతా వారిని తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. గల్ఫ్ దేశాలు, మలేషియా, సింగపూర్లో ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాం. మా ప్రయత్నాలు కొనసాగేలా వందే భారత్ మిషన్ నాలుగో విడత జులై 3న ప్రారంభమవుతుంది. ఈ సారి ఎక్కువ మంది భారతీయులున్న దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. "