లాక్డౌన్ సడలింపులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లలో.. వచ్చే ఏడు రోజుల కోసం 2లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు రైల్వేశాఖ తెలిపింది. బుధవారం 20,149 మంది తమ గమ్యస్థానాలకు చేరుకోగా.. గురువారం 25,737 మంది ఈ ప్రత్యేక రైళ్లల్లో ప్రయాణించనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం కేటాయించిన 9 రైళ్లలో 9వేల మంది ప్రయాణికులు దేశ రాజధాని దిల్లీ నుంచి బయల్దేరారు. ఈ-టికెట్ల బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ.45.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది రైల్వేశాఖ.
ఈ తొమ్మిది రైళ్లలో ఎనిమిదింటికి వాటి సామర్థ్యాన్ని మించి టికెట్లు బుక్ అయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాకు వెళ్లే రైలు మాత్రం 87శాతం ప్రయాణికులతో నడిచింది.
వివరాలివే..
- హౌరా నుంచి దిల్లీ వెళ్లే రైలు సామర్థ్యానికి మించి 122శాతం టికెట్లు బుక్ అయ్యాయి.
- దిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే రైలుకు రిజర్వేషన్ అయిన టికెట్లు 133శాతం.
- దిల్లీ నుంచి చెన్నై వెళ్లే రైలుకు బుక్ అయిన టికెట్లు 150శాతం.
- దిల్లీ నుంచి జమ్ము వెళ్లే రైలుకు 109శాతం టికెట్లు బుక్ అయ్యాయి.
- దిల్లీ నుంచి రాంచీ వెళ్లే రైలుకు బుక్ అయిన టికెట్లు 115శాతం.
- దిల్లీ నుంచి ముంబయి వెళ్లే రైలుకు రిజర్వ్ అయిన టికెట్లు 117శాతం.
- దిల్లీ నుంచి అహ్మదాబాద్, దిబ్రూగఢ్ వెళ్లే రైళ్లకు 102, 133 శాతం చొప్పున టికెట్లు అమ్ముడుపోయాయి.
టికెట్లు సామర్థ్యానికి మించి బుక్ అయ్యాయంటే ప్రయాణికులు రైళ్లలో నిలబడ్డారని అర్థం కాదు. ప్రతి స్టేషన్లో ప్రయాణికులు బోర్డింగ్, డీ బోర్డింగ్ చేస్తున్నారు. ఈ విధంగానే ఎక్కువగా టికెట్లు బుక్ అయ్యాయి.