కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2.5 లక్షల మందికిపైగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మొత్తం 4.5 లక్షల మంది స్వదేశానికి వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించింది.
" మూడో దశలో 550 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలించాం. మొత్తం 41 దేశాలకు వందే భారత్ మిషన్ సేవలు విస్తరించాం. ఇప్పటి వరకు 2,50,087 మంది భారత్కు తిరిగి వచ్చారు. వారిలో 21 శాతం మంది వలస కార్మికులు ఉన్నారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి సరిహద్దుల గుండా 75వేలకుపైగా వలస కార్మికులు స్వదేశానికి వచ్చారు. చార్టెడ్ విమానాల ద్వారా 57వేల మందికిపైగా భారత్కు వచ్చారు."
- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి