ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో మొత్తం 2.5 లక్షల మంది ప్రభావితమయ్యారు. వరదల్లో చిక్కుకొని ఇప్పటి వరకు 16 మంది మృతిచెందారు.
వేలాది మంది నిరాశ్రయులు..
మొత్తం 706 గ్రామాలు వరదల్లో చిక్కుకుపోయినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు (ఏఎస్‌డీఎంఏ) తెలిపారు. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది అధికార యంత్రాంగం. 18 వేల మందిని.. 142 సహాయ శిబిరాల్లోకి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి మరో 21 మంది మరణించారు.