1000 మంది పైలట్ల విధుల బహిష్కరణ జెట్ ఎయిర్వేస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇప్పటికే చాలా వరకు విమాన సర్వీసులను నిలిపేసింది. తాజాగా బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకోవటంలో విఫలమైంది.
బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో సుమారు 1000 మంది పైలట్లు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 31 లోపు బకాయిల చెల్లింపు, పునరుద్ధరణ ప్రణాళిక ప్రకటించకపోతే సమ్మె చేయటం తప్పదని హెచ్చరించారు.
"ఎస్బీఐ నుంచి తాత్కాలిక నిధుల సమీకరణ మార్చి 29 లోపు జరగాల్సి ఉంది. అనుకోకుండా నిధుల బదిలీ జరగలేదు. సంస్థ యాజమాన్యం నుంచి జీతాల చెల్లింపుపై ఎలాంటి పురోగతి లేదు. ముంబయి, దిల్లీలో పైలట్లు తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది."
- కరణ్ చోప్రా, భారత వైమానిక సంఘం అధ్యక్షుడు
సాధారణ పరిస్థితులను పునరుద్ధరించటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేపడుతున్నామని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది.
జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్ అధికారులకు నాలుగు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది.