కొత్త సాగు చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం ఊపందుకుంటోంది. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల కవాతులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ వార్త కలకలం రేపుతోంది. ఎర్రకోట ఘటనల అనంతరం గత 5 రోజులుగా 100 మందికిపైగా నిరసనకారుల జాడ తెలియడం లేదంటూ పంజాబ్ మానవహక్కుల సంస్థ శనివారం వెల్లడించింది. వీరిలో మోగా జిల్లా తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులూ ఉన్నట్లు తెలిపింది.
అయితే.. దాదాపు 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని.. మరి మిగతా వారి సంగతేంటో తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది.
కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన జాబితాలు తమకు అందుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్ సింగ్ వెల్లడించారు. సమగ్ర పరిశీలన అనంతరం.. అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామన్నారు.