శబరిమలలో అయ్యప్ప దర్శనార్థం భక్తులను నవంబర్ 17 నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కల్పించటానికి 5 దశలుగా 10 వేల 17 మంది పోలీసులను నియమించినట్లు అధికారులు తెలిపారు.
24 మంది ఎస్పీలు, అసిస్టెంట్ ఎస్పీలు, 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్స్పెక్టర్లు, 1185 మంది సబ్-ఇన్స్పెక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. 307 మంది మహిళా పోలీసులతో సహా మొత్తం 8402 మంది పోలీస్ అధికారులు విధులను నిర్వహిస్తారని ప్రకటన విడుదల చేశారు.
మొదటి దశలో 2 వేల మందికిపైగా...
నవంబర్ 15-30 మధ్య మొదటి దశలో 2,551 మంది పోలీసులు ఆలయ సన్నిధానం, పంబా, నీలకల్, ఎరుమెలి, పతనంతిట్ట ప్రాంతాల్లో భద్రతను కల్పిస్తారని పేర్కొన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఇటీవల సన్నాహకాలను దగ్గరుండి పరిశీలించారు. ఆలయ బాధ్యతలను చూసే ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు సహా.. ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సుప్రీం తీర్పుతో ఆందోళనలు...
ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు 2018లో చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు.. ఎల్డీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సమయంలో ఆందోళనలు చెలరేగాయి.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. తక్షణమే అమల్లోకి