భారత్‌లో చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. శనివారం 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. అయితే, కొవిన్ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడం వల్ల కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ టీకా వేసినట్టు తెలిపింది. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు వెల్లడించింది.
వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన ప్రధాని
టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఒకేసారి రెండు దేశీయ తయారీ టీకాలు ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలు అన్ని విధాల ప్రశంసనీయులని అన్నారు. టీకాల తయారీతో దేశ శాస్త్రవేత్తలు.. భారత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. కరోనా టీకా రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలన్న మోదీ.. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ తరుణంలో ఏడాదిగా కరోనా పోరులో భారత పాత్రను గుర్తుచేసుకుంటా భావోద్వేగానికి లోనయ్యారు.
మొదటి టీకా వారికే..
దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కేంద్రం చెప్పినట్లుగానే తొలి టీకాని పారిశుధ్య కార్మికులకు వేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి నడిపించిన కరోనా వారియర్స్‌కు దేశంలోని అనేక రాష్ట్రాల్లో తొలిటీకా వేశారు. దిల్లీలో పారిశుధ్య కార్మికుడు మనీష్ కుమార్‌కు ఎయిమ్స్ వైద్యులు తొలి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
టీకా పంపిణీల పై సమీక్షలు..
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రజా వైద్యశాలలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని బలరాంపుర్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడులో చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలను అందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సమయంలో అక్కడే ఉండి వారిలో ధైర్యం నింపారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. మొహలీలో టీకా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.
టీకా వేయించుకున్న ప్రముఖులు వీరే..