తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూతాపం కట్టడికి కర్బన విపణులు

నానాటికీ వేడెక్కిపోతున్న భూగోళాన్ని చల్లబరచడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవడంలో ఇటీవల మాడ్రిడ్‌లో జరిగిన కాప్​-25వ సదస్సు మళ్లీ విఫలమైంది. 2021 నాటికల్లా పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి రంగం సిద్ధం చేస్తుందని తలపోశారు. కానీ, క్యోటో ఒప్పందం కింద సంపాదించిన కర్బన క్రెడిట్లను ఎలా ఉపయోగించాలనే అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తి కాప్‌ 25వ సదస్సు నిష్ఫలంగా ముగిసింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరిగే 26వ కాప్‌ సదస్సులోనైనా ఏకాభిప్రాయం కుదిరితే కానీ- 2021కల్లా పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం కాదు.

Organic markets for global warming
భూతాపం కట్టడికి కర్బన విపణులు

By

Published : Dec 25, 2019, 8:20 AM IST

పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల 25వ సదస్సు (కాప్‌-25) స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఇటీవల ముగిసింది. నానాటికీ వేడెక్కిపోతున్న భూగోళాన్ని చల్లబరచడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవడంలో సదస్సు మళ్లీ విఫలమైంది. ‘కాప్‌-25’ అంతర్జాతీయ కర్బన క్రెడిట్ల వ్యాపారానికి కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందిస్తుందని ఆశించారు. వాతావరణ మార్పులను అరికట్టడంలో వర్ధమాన దేశాలకు మరింత ఆర్థిక సహాయం అందించడానికి నిబద్ధత చాటుతుందనీ భావించారు. తద్వారా 2021 నాటికల్లా పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి రంగం సిద్ధం చేస్తుందని తలపోశారు. కానీ, క్యోటో ఒప్పందం కింద సంపాదించిన కర్బన క్రెడిట్లను ఎలా ఉపయోగించాలనే అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తి మాడ్రిడ్‌ కాప్‌ 25వ సదస్సు నిష్ఫలంగా ముగిసింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరిగే 26వ కాప్‌ సదస్సులోనైనా ఏకాభిప్రాయం కుదిరితే కానీ- 2021కల్లా పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం కాదు.

క్యోటో క్రెడిట్లు అంటే?

జపాన్‌లోని క్యోటోలో 1997లో కుదిరిన ఒప్పందం కింద కాలుష్య రహిత అభివృద్ధి యంత్రాంగం (సీడీఎం) అమలులోకి వచ్చింది. దానిపై అమెరికా తప్ప మిగిలిన సంపన్న దేశాలు సంతకం చేశాయి. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకొంటున్న సంగతి తెలిసిందే. వర్ధమాన దేశాల్లోని కంపెనీలు కాలుష్యకారక శిలాజ ఇంధనాల బదులు- పునరుత్పాదక ఇంధనాలతో పరిశ్రమలు స్థాపించి, అడవులను పెంచినప్పుడు నిర్ణీత నిష్పత్తిలో కర్బన క్రెడిట్లు లభిస్తాయి. పవన, సౌర విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధనాలతో నడిచే ప్రాజెక్టులు ఒక టన్ను కర్బన ఉద్గారాలను తగ్గిస్తే ఒక కర్బన క్రెడిట్‌ లభిస్తుంది. దీన్ని ధ్రువీకృత ఉద్గారాల తగ్గింపు పత్రం (సీఈఆర్‌)గా వ్యవహరిస్తారు. ఈ క్రెడిట్లకు ధన రూపంలో విలువను నిర్దేశించారు. వీటి కొనుగోళ్లు, అమ్మకాలు ‘ఆన్‌లైన్‌ రిజిస్ట్రీ’లో జరుగుతాయి.

క్యోటో ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన సంపన్న దేశాల కంపెనీలు వర్ధమాన దేశాల నుంచి కర్బన క్రెడిట్లను కొంటాయని సీడీఎం నిర్దేశించింది. ఆ క్రెడిట్లు పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలులోకి వచ్చాక మురిగిపోతాయని భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాల ఆందోళన. పారిస్‌ ఒప్పందం విధించే కర్బన ఉద్గారాల లక్ష్యాలను క్యోటో క్రెడిట్లతో చెల్లువేయాలని ఆస్ట్రేలియా పట్టుబట్టింది. భారతీయ కంపెనీలు 1,669 ప్రాజెక్టుల ద్వారా 24.66 కోట్ల కర్బన క్రెడిట్లు సంపాదించి ఉన్నాయి. స్వచ్ఛంద విపణి కింద నమోదైన 526 ప్రాజెక్టుల ద్వారా 8.9 కోట్ల క్రెడిట్లు దఖలు పడనున్నాయి.

భారతీయ కంపెనీలన్నీ కలిపి 35 కోట్ల కర్బన క్రెడిట్లను సంపాదించాయి. కంపెనీ షేర్ల మాదిరిగా ఈ కర్బన క్రెడిట్ల ధర కూడా మారుతూ ఉంటుంది. ఒక దశలో ఈ క్రెడిట్ల అమ్మకం రూ.45,000 కోట్లు సంపాదించిపెడుతుందని భారతీయ కంపెనీలు లెక్క వేసుకున్నాయి. గతంలో 25 డాలర్లు, 15 డాలర్ల చొప్పున పలికిన ఒక్కో కర్బన క్రెడిట్‌ ధర నేడు 25 సెంట్లకు పడిపోయింది (అంటే రూపాయికి పావలాయే వస్తుందన్నమాట). తాము ఎంతో కష్టించి క్యోటో ఒప్పందం అమలు చేయడం ద్వారా సాధించిన కర్బన క్రెడిట్ల విలువ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉండటం భారత్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. పారిస్‌ వాతావరణ ఒప్పందం కింద సాధించే కర్బన క్రెడిట్లకు క్యోటో కర్బన క్రెడిట్లను చేర్చాలని అవి కోరుతున్నాయి. ఇంతవరకు జరిగిన 25 కాప్‌ సదస్సులలో దేనిలోనూ కర్బన క్రెడిట్ల విపణి నియమనిబంధనలను రూపొందించలేకపోయారు.

కర్బన ఉద్గారాల తగ్గింపు మీదే దృష్టి...

క్యోటో ఒప్పందం కింద తాము సంపాదించిన కర్బన క్రెడిట్లను మురిగిపోనివ్వడం అన్యాయమని భారత్‌ వంటి వర్ధమాన దేశాలు మాడ్రిడ్‌ సదస్సులో వాదించాయి. దీన్ని ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు, ఆఫ్రికా దేశాలతోపాటు, ద్వీప దేశాలూ ప్రతిఘటించాయి. కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసే సంపన్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను గాలికి వదిలేసి యథాతథంగా వాతావరణాన్ని కలుషితం చేస్తూనే ఉంటాయని ఈయూ శిబిరం వాదించింది. కానీ, ఈ వాదన సరైనది కాదు. సంపన్న దేశాలు తాము వెదజల్లే బొగ్గు పులుసు వాయువుకు సమానమైన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తప్పించుకోవడం కుదరదు. ఉదాహరణకు వంద క్రెడిట్లలో 75 క్రెడిట్లకు సమానమైన ఉద్గారాలను స్వదేశంలో తగ్గించి, మిగతా 25 శాతం క్రెడిట్లను మాత్రమే విదేశాల నుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది.

భారతదేశం మొదటి నుంచీ కర్బన క్రెడిట్ల ఆర్జనకు ఉత్సాహంగా కృషిచేసింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్‌ఎంఈ) కర్బన ఉద్గారాల తగ్గింపు మీద దృష్టి పెట్టింది. 2005లో సీడీఎం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి చైనా తరవాత అత్యధిక సీడీఎం ప్రాజెక్టులు చేపట్టింది. ఎంఎస్‌ఎంఈ రంగంలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ భారీయెత్తున కర్బన క్రెడిట్లను సొంతం చేసుకుంది. మొత్తం మీద 1,30,000 కోట్ల రూపాయలతో భారత్‌లో చేపట్టిన సీడీఎం (కాలుష్య రహిత అభివృద్ధి యంత్రాంగం) ప్రాజెక్టులు 17 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగాయి.

తగ్గుతున్న గిరాకీ

ప్రపంచమంతటా మెరుగైన సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెరుగుతున్నందువల్ల మునుపటి స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడటం లేదు. దీనివల్ల సీడీఎం ప్రాజెక్టుల ఆకర్షణ తగ్గింది. స్పెయిన్‌ తదితర సంపన్న దేశాల్లో ఉన్న పరిశ్రమలూ మూతబడిపోయినందువల్ల, కర్బన క్రెడిట్లకు గిరాకీ పడిపోయింది. ఫలితంగా భారతదేశంలోనూ సీడీఎం ప్రాజెక్టుల నుంచి లభించే కర్బన క్రెడిట్లు లేదా సీఈఆర్‌లు తగ్గిపోతున్నాయి. భారత్‌లో 2010 నుంచి సీడీఎం ప్రాజెక్టుల పుణ్యమా అని కర్బన ఉద్గారాలు కొంతమేర తగ్గాయి.

పలు కారణాల వల్ల అంతర్జాతీయ విపణిలో కర్బన క్రెడిట్ల ధరలు పడిపోతున్నందువల్ల చైనా, బ్రెజిల్‌, కెనడాలు స్వతంత్ర కర్బన క్రెడిట్‌ విపణులను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశంలో 2020లో అటువంటి విపణి ఏర్పడనున్నది. ప్రపంచ బ్యాంకు తోడ్పాటుతో అవతరించే ఈ స్వతంత్ర విపణిలో ఎంఎస్‌ఎంఈ రంగం పెద్ద పాత్ర పోషిస్తుంది.

వాతావరణ మార్పుల నిరోధానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల సాయంతో పరస్పరం కర్బన క్రెడిట్ల వ్యాపారం చేపట్టవచ్చు. లేదా స్వదేశంలోని కంపెనీల మధ్య ఈ వ్యాపారం జరిగేట్లు ప్రోత్సహించవచ్చు.

ఎగుమతి మార్కెట్‌లో భారత్‌

ఎగుమతి మార్కెట్‌లో భారత్‌

భూతాపం కట్టడికి కర్బన విపణులు పవన విద్యుత్పాదన వల్ల కర్బన క్రెడిట్లు దండిగా లభిస్తున్న మాట నిజమే కానీ, ఆ క్రెడిట్ల విలువ నానాటికీ తగ్గిపోవడం మింగుడు పడని వాస్తవం. భారతదేశ పవన విద్యుత్‌ పరిశ్రమకు 10,000 మెగావాట్ల విద్యుదుత్పాదన పరికరాలను తయారుచేసే సత్తా ఉన్నా, 2017-18 వరకు కేవలం 1,500 మెగావాట్ల ఉత్పాదక పరికరాలను మాత్రమే అమర్చగలిగారు. మిగిలిన పరికరాల్లో కొంత విదేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుతం 50 కోట్ల డాలర్ల విలువైన ఉత్పాదక పరికరాలను ఎగుమతి చేస్తుండగా, అంతకు నాలుగింతలు ఎగుమతి చేయగల అవకాశం మన పరిశ్రమకు ఉంది. పవన విద్యుత్‌ టవర్లు, బ్లేడ్లను అమెరికాకు సైతం ఎగుమతిచేస్తున్నారు.

సౌర విద్యుత్‌ కంపెనీలు ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో ఇతర దేశాలకు లేదా సంస్థలకు సౌర విద్యుత్‌ కర్మాగాలను నిర్మిస్తున్నాయి. ఎల్‌ఎం విండ్‌ సంస్థ 20 కోట్ల డాలర్ల విలువైన బ్లేడ్‌లను ఎగుమతి చేయగా, విండార్‌ సంస్థ ఈ ఏడాది 60 కోట్ల డాలర్ల విలువైన ఉక్కు టవర్లను అమెరికా తదితర దేశాలకు విక్రయించింది. స్కార్పియస్‌ ట్రాకర్స్‌ సంస్థకు అమెరికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, జింబాబ్వేల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ సంస్థ సూర్యుడి గమనానికి అనుగుణంగా తిరిగే ట్రాకర్లను తయారుచేస్తోంది.

నేడు చైనాకన్నా చవకగా భారత్‌లో పవన విద్యుదుత్పాదన పరికరాలు తయారవుతున్నందువల్ల ఎగుమతుల విస్తరణకు ఎంతో అవకాశముంది. దీన్ని పసిగట్టిన అంతర్జాతీయ విండ్‌ టర్బైన్‌ తయారీదారులు భారత్‌లో కర్మాగారాలు స్థాపించి, విదేశాలకు ఎగుమతి చేయడానికి నడుం కట్టాయి. డెన్మార్క్‌కు చెందిన వెస్టాస్‌ విండ్‌ సిస్టమ్స్‌ స్థాపించిన ఒక కర్మాగారం వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభిస్తుంది. జర్మనీకి చెందిన సెన్వియాన్‌ సంస్థ మహారాష్ట్రలో తనకున్న కర్మాగారాన్ని మరింత విస్తరించనున్నది. పవన విద్యుత్‌ ప్లాంట్‌కు కావలసిన పరికరాల్లో 90 శాతాన్ని భారత్‌లోనే తయారుచేయవచ్చు. గేర్‌ బాక్సులు, జనరేటర్లు, బ్లేడ్‌లు, టవర్ల వంటివి ఇక్కడే తయారవుతున్నాయి- కనుకనే విదేశీ కంపెనీలు ఇక్కడ నుంచి ఎగుమతులు చేయాలని ఉబలాటపడుతున్నాయి.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చూడండి: 'భారత్​-పాక్​ మధ్య సయోధ్యకు చైనా ప్రయత్నాలు'

ABOUT THE AUTHOR

...view details