అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సహేతుకమైన ధరకు ఆహార ఉత్పత్తులు అందించడం అతిపెద్ద సవాలు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంవల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదన్న హెచ్చరికలనూ ఖాతరు చేయకుండా- అధిక ఉత్పత్తి, అత్యధిక లాభాలమీదే దృష్టిపెడుతూ మొండిగా ముందుకు వెళుతున్న తీరును మార్చుకోవాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చెవికెక్కించుకుంటుండటం శుభసూచకం. ఇటీవల కేంద్ర బడ్జెట్లో దేశంలో సుస్థిర వ్యవసాయభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020-’21 మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయ భూమిని నాలుగు లక్షల హెక్టార్లకు విస్తరించాలని బడ్జెట్లో దిశానిర్దేశం చేశారు. అన్నదాతలకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరచేందుకు ఉద్దేశించిన పరంపరాగత్ కృషి వికాస్ పథకానికి హరిత విప్లవ బడ్జెట్ కింద అయిదువందల కోట్ల రూపాయలను కేటాయించారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించే రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందాలంటే ‘సేంద్రియ సర్టిఫికేషన్’ తప్పనిసరి. ఆ రకంగా ‘సేంద్రియ సర్టిఫికేషన్’ కింద ఉన్న భూమి పరిమాణాన్ని ఇటీవల అదనంగా విస్తరించిన 0.51 లక్షల హెక్టార్లకు ఈ డబ్బును ఉపయోగించాలన్నది ప్రభుత్వ నిర్దేశం. దీనివల్ల సేంద్రియ ఉత్పత్తులు పెరిగి, ప్రజలకు పెద్దయెత్తున అందుబాటులోకి వస్తాయి. దానితోపాటు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులూ ఊపందుకుంటాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2018-’19లో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,151 కోట్లకు పెరిగినట్లు అంచనాలున్నాయి.
దేశం పురోభివృద్ధి సాధించాలంటే కీలకమైన కొన్ని రంగాలు గుణాత్మకంగా మెరుగుపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడో స్పష్టీకరించారు. దేశంలో సేంద్రియ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించడం ఆయన స్వప్నాల్లో ఒకటి. 2030నాటికి సేంద్రియ సేద్యాన్ని గణనీయంగా మెరుగుపరచాలని ప్రధాని లక్ష్య నిర్దేశం చేశారు. నిరుడు ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్లోనూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. తాజాగా నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్ సైతం సేంద్రియ సేద్యానికి సంబంధించి అదే ఒరవడిని కొనసాగించడం విశేషం. భారత వ్యవసాయ శుద్ధి, ఎగుమతుల అభివృద్ధి మండలి (అపెడా) అంచనాల ప్రకారం 2025నాటికి సేంద్రియ ఎగుమతుల విలువను మూడు లక్షల 60వేల కోట్ల రూపాయలకు చేర్చాలని తలపోస్తోంది. అయితే ఈ స్థాయికి ఎగుమతులను చేర్చాలంటే ధ్రువీకృత సేంద్రియ విత్తనాలు చాలినన్ని ఉన్నాయా, సంప్రదాయ సేంద్రియ విత్తనాలపై ఆధారపడితే ఆశించిన స్థాయిలో గణనీయ ఉత్పత్తులు సాధ్యమవుతాయా అన్న అంశాలపై మేధామథనం అవసరం. మేలిమి సేంద్రియ విత్తనాలను భారతీయ రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే- ఉత్పత్తుల్లో ఆశించిన ఎదుగుదల సాధ్యంకాదు.