నిర్భయ కేసు దోషులకు అతి త్వరలోనే మరణ శిక్ష అమలు చేయడం ఖాయమా?2012లో వైద్యవిద్యార్థినిపై అకృత్యానికి పాల్పడిన డిసెంబర్ 16 అందుకు ముహూర్తమా?ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ. ఉరి తాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్లోని బక్సర్ జైలుకు ఆదేశాలు వెళ్లడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
10 ఉరి తాళ్లకు ఆర్డర్
"డిసెంబర్ 14కల్లా 10 ఉరి తాళ్లు సిద్ధంగా ఉంచాలని జైళ్ల డైరక్టరేట్ నుంచి మాకు ఆదేశాలు అందాయి. అవి ఎవరి కోసం ఉపయోగిస్తారో మాకు తెలియదు. ఉరి తాళ్ల తయారీలో బక్సర్ జైలుకు మంచి పేరు ఉంది."
-విజయ్ కుమార్ అరోరా, బక్సర్ జైలు ఎస్పీ
బక్సర్ ఉరి తాళ్ల విశేషాలు:
- ఒక్కో ఉరి తాడు తయారీకి 3 రోజులు పడుతుంది. తయారీ అంతా దాదాపుగా చేతి పనే. యంత్రాల వాడకం చాలా తక్కువ.
- ఉగ్రవాది అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలుకు బక్సర్ ఉరి తాడునే ఉపయోగించారు.
- పాటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్ల తయారీకి గతంలో ఆర్డర్ వచ్చింది. కానీ అవి ఎవరి కోసమో స్పష్టత లేదు.
ఖరీదు ఎక్కువే...
చివరిసారిగా బక్సర్ జైలు సరఫరా చేసిన ఉరి తాడు ధర.1,725గా ఉంది. ఈ ధర ఉక్కు, ఇత్తడి ధరల ఆధారంగా మారుతుంది. ఈ లోహాలతో తయారుచేసే తాడు మనిషికి ఉరేసినప్పుడు తెగకుండా ఉంటుంది. గొంతుకు వెంటనే బిగుసుకొని క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది.
"ఈ ఉరితాళ్లను సాధారణంగా ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు తయారుచేస్తారు. 7000 దారం పోగులతో ఒక తంతువు తయారుచేస్తారు. ఇలాంటి 152 తంతువులు ఉపయోగించి కావలసిన కొలతలతో ఒక ఉరితాడు తయారుచేస్తారు."
విజయ్ కుమార్ అరోరా, బక్సర్ జైలు ఎస్పీ
ఈ తాళ్లను ముందుగానే తయారుచేసి ఉంచరు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ ఇవి పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే అవసరమైనప్పుడే వీటిని తయారుచేస్తారు.
'దిశ' ప్రభావం..
హైదరాబాద్కు చెందిన యువ పశువైద్యురాలు దిశ హత్యాచార నిందితులకు పోలీసులు ఎన్కౌంటర్ చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిర్భయ హంతకులకు కూడా వీలైనంత త్వరగా మరణశిక్ష అమలుచేయాలని ప్రజలు, ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.