ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో.. పార్లమెంటు సమావేశాల నిర్వహణపైనా అనిశ్చితి నెలకొంది. అయితే వర్షాకాల సమావేశాలను హైబ్రిడ్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారని ఇది వరకే పలు ఊహాగానాలు వ్యక్తమవగా.. తాజా పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా.. ఉభయసభల సెక్రటరీ జనరల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్-19 ఆంక్షలను పాటిస్తూ.. ఎంపీలందరినీ ఒకే చోట చేర్చేందుకు పార్లమెంటు భవనాలు సరిపోవని ఉభయసభల సెక్రటరీ జనరల్‌లు వివరించినట్లు సమాచారం. చట్టసభ సభ్యులందరూ కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ.. కూర్చునేందుకు పార్లమెంటు సెంట్రల్ భవనంలోగానీ, విగ్యాన్ భవన్ ప్లీనర్ హాల్లోగానీ సరిపడా సీట్లు లేవని వివరించినట్లు తెలుస్తోంది.
"భౌతిక దూరం ఆంక్షలకు అనుగుణంగా.. రాజ్యసభలో 60మంది, లోక్‌సభలో 100 మంది ఎంపీలు మాత్రమే కూర్చునేందుకు వీలవుతుంది. ఒకవేళ గ్యాలరీల్లో కూర్చోబెట్టినా.. ఇంకా కొంత మందికి సీట్లు తక్కువ అవుతాయి" అని వెంకయ్య, ఓం బిర్లాకు ఉభయసభల సెక్రటరీలు వివరించారు.