కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకోవడం అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చెన్నై, మేఘాలయల్లో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు. వీటిపై సామాజిక చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన... ఈ మేరకు సూచనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ప్రజలను కోరారు.
వైద్యుడిగా సేవలందిస్తూ కరోనా బారిన పడి.. చెన్నైలో మృతిచెందాడు నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్. అతడి మృతదేహాన్ని మొదట ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోగా, ఆ తర్వాత అంబత్తూరు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలోనూ మళ్లీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ఘటనలు అమానవీయమని వెంకయ్యనాయుడు అన్నారు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చొరవతీసుకుని వేరేచోట అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం దారుణమన్నారు.