తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజా ఫలితాలతో ప్రాంతీయ శక్తుల్లో నూతనోత్తేజం!

హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల్లో నూతనోత్సాహాన్ని నింపాయా అంటే.. అవుననే అంటున్నాయి ఆయా వర్గాలు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్, దిల్లీకి చెందిన ప్రాంతీయ శక్తులు జేఎంఎం, ఆప్ తాజా ఫలితాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నాయి. భాజపా ఓట్ల శాతం తగ్గిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు తమకు లాభిస్తాయని అంచనా వేస్తున్నాయి.

తాజా ఎన్నికల ఫలితాలతో ప్రాంతీయ శక్తుల్లో నవోత్సాహం

By

Published : Oct 26, 2019, 10:41 AM IST

Updated : Oct 26, 2019, 2:21 PM IST

తాజా ఫలితాలతో ప్రాంతీయ శక్తుల్లో నూతనోత్తేజం!

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలతో ప్రాంతీయ పార్టీలకు నూతన ఉత్తేజం లభించింది. రెండు రాష్ట్రాల్లో భాజపా ఆశించిన మేరకు రాణించకపోవడం.. ప్రాంతీయ రాజకీయ శక్తుల్లో ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.

ఈ ఫలితాలు త్వరలో జరగనున్న ఝార్ఖండ్​, దిల్లీ శాసనసభలపై ప్రభావం చూపే అవకాశముంది. ఝార్ఖండ్ శాసనసభకు ఈ ఏడాది చివర్లో.. దిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఎన్నికలు జరగనున్నాయి.

మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న భాజపా ఆశలకు గండిపడింది. మెజారిటీ దక్కకపోవడం వల్ల శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి కాషాయదళానిది. హరియాణాలోనూ ఇదే పరిస్థితి. జేజేపీతో పొత్తుతో ప్రభుత్వాన్ని స్థాపించనుంది భాజపా.

ఝార్ఖండ్​ 'ముక్తి'లో చిగురించిన ఆశలు

రానున్న ఎన్నికలపై హరియాణా, మహారాష్ట్ర ఫలితాల ప్రభావం కచ్చితంగా పడుతుందని ఝార్ఖండ్​ ముక్తి మోర్చాకు చెందిన నేత అభిప్రాయపడ్డారు. లోక్​సభ ఎన్నికల్లో భాజపా-విపక్షాల మధ్య ఓట్ల భేదం 21 శాతంగా నమోదైందని... రానున్న ఎన్నికల్లో ఇది 10 శాతం మేర పడిపోవచ్చన్నారు. హరియాణా ఫలితాల్లో 22 శాతం ఓట్లను అధికార భాజపా కోల్పోయిందని.. మహారాష్ట్రలో 10 శాతం ఓట్లను పోగొట్టుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేఎంఎం పార్టీల కూటమి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ప్రభుత్వాన్ని ఓడించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష కూటమి ప్రచారం ఒకే నేత సారథ్యంలో ముందుకు సాగితే భాజపా నుంచి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత హేమంత్ సోరెన్​ను విపక్షాల తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయాలని జేఎంఎం నేతలు కోరుతున్నారు.

ఆప్​కు లాభం ఉంటుందా?

దిల్లీలో భాజపా నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత లేకపోవడం తమకు లాభిస్తుందని ఆమ్​ ఆద్మీ పార్టీ​ నేతలు అంచనా వేస్తున్నారు. కాషాయ పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితితో ఆప్​ మరోసారి విజయం సాధించి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తోంది. అయితే లోక్​సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లను భాజపా కైవసం చేసుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

Last Updated : Oct 26, 2019, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details