కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ అట్టుడుకుతోంది. వ్యవసాయ రంగంలో సంస్కరణను ఉద్దేశించిన ఈ బిల్లులను పార్లమెంటు ఉభయసభలు ఆమోదించటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో ఆదివారం ఆందోళనకు దిగగా.. అదే తంతును సోమవారం కొనసాగించాయి. సభ ప్రారంభమైన తర్వాత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్య. అది సరైన విధానంలో లేదని.. 14 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.
8 మంది ఎంపీలపై వేటు..
బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో గందరగోళం సృష్టించిన టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సహా ఎనిమిది మందిపై సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. 8 మందిపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే.. సస్పెండ్‌కు గురైన సభ్యులు సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించటం వల్ల సభ పలు మార్లు వాయిదా పడింది.
అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే సభ కొనసాగించే ప్రయత్నం చేశారు ఛైర్మన్. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సహా ఇతర అంశాలపై చర్చకు ఆహ్వానించారు. కానీ, ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ అయిన వారు ఆందోళన చేపట్టారు. దాంతో పలు మార్లు సభ వాయిదా పడింది. సభను రోజు మొత్తం వాయిదా వేయాలని నినదించారు. ఇక చేసేదేమీ లేక సభను మంగళవారం ఉదయం 9 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.
పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన..
ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయటంపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, సీపీఎం, శివసేన, జేడీఎస్, టీఎంసీ, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం, పార్లమెంటు మరణం, సిగ్గుచేటు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు విపక్ష ఎంపీలు.
ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమని, ఏకపక్షమని పేర్కొంది కాంగ్రెస్. సభ్యుల గొంతుకను అణచివేయటం, ఆ తర్వాత సస్పెండ్ చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
రైతుల కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయటం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్య నిబంధనలు, సూత్రాలను గౌరవించని నిరంకుశ ప్రభుత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం ముందు తలవంచం. పార్లమెంట్‌తో పాటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాడతాం.