పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన చేసిన మెరుపుదాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశ రక్షణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మోదీ ఉల్లంఘించారని ఆరోపించాయి.
బాలాకోట్‌పై భారత వాయుసేన చేసిన మెరుపుదాడిలో మన యుద్ధవిమానాలను పాకిస్థాన్ రాడార్లు గుర్తించకుండా మేఘాలు సహాయపడతాయని వాయుసేనకు సలహా ఇచ్చానని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. మోదీ తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాయి. సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రక్షణకు ముప్పు
దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సైనిక చర్యల కార్యాచరణ వివరాలను మోదీ వెల్లడించడం సిగ్గుచేటని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఓ టీవీ కార్యక్రమంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఫిర్యాదు చేసింది సీపీఎం.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
" ఐదేళ్ల నుంచి మోదీ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. మేఘావృత వాతావరణం తనను రాడార్లు గుర్తించకుండా కాపాడుతుందని అనుకుంటున్నారు." - కాంగ్రెస్ ట్వీట్