హాథ్రస్ ఘటన జరిగి రోజులు గడవక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బలరాంపుర్ జిల్లాలో 22 ఏళ్ల దళిత యువతిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించాయి.
ఇదీ చదవండి-యూపీలో ఘోరం.. మరో రెండు 'నిర్భయ' ఘటనలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 'ఆటవిక రాజ్యానికి ఎలాంటి హద్దులు లేవు' అని కాంగ్రెస్ విమర్శించింది. యోగి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్ పాలనలో మహిళలపై దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఉత్తర్‌ప్రదేశ్ ఆటవిక రాజ్యంలో మహిళలపై అకృత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. మహిళలు ప్రాణాలతో ఉన్నప్పుడు గౌరవం ఇవ్వలేదు. మరణించిన తర్వాత కూడా గౌరవం దక్కనివ్వలేదు. ఆడపిల్లలను కాపాడాలన్నది భాజపా నినాదం కాదు. నిజాలు దాచి, అధికారాన్ని కాపాడుకోవాలనేదే వారి నినాదం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
హాథ్రస్లో జరిగిన క్రూరమైన ఘటన బలరాంపుర్లోనూ జరిగిందని, ఆటవిక రాజ్యానికి హద్దులు లేవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఆజాంఘర్, బాఘ్పట్, బులంద్‌షహర్‌లో బాధితురాళ్లను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
"యూపీలో ఆటవిక రాజ్యం వ్యాప్తికి హద్దులు లేవు. ప్రచారాలు, ప్రసంగాల ద్వారా శాంతి భద్రతలను నెలకొల్పలేము. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జవాబుదారీగా ఉండేందుకు ఇదే సరైన సమయం. ప్రజలు జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టం ఇంకా బతికే ఉందా అని యోగి సర్కార్‌ను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది రాజ్యాంగ ప్రభుత్వమా, లేదా నేరస్థుల ప్రభుత్వమా అంటూ ఎద్దేవా చేశారు.