దిల్లీల్లో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల విషయంలో పోలీసుల పాత్రకు సంబంధించి విపక్షాల నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు లేవనెత్తుతూ మెమొరాండమ్‌ను ఇచ్చారు.
దిల్లీ అల్లర్లపై రాష్ట్రపతి వద్దకు విపక్ష నేతలు - దిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను విపక్షాల నాయకులు గురువారం స్వయంగా కలిశారు. ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లర్లపై పోలీసులు చేసిన దర్యాప్తుపై పలు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతికి మెమొరాండమ్ ఇచ్చారు.
దిల్లీ అల్లర్లపై రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్షనాయకులు
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన యువకులను, కార్యకర్తలను పోలీసులు దిల్లీ అల్లర్ల కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులను కావాలని ఇందులో భాగస్వాములను చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరును అభియోగ పత్రంలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు.
మెమొరాండమ్‌లో ఏముంది?
- అల్లర్లకు సంబంధించిన వీడియోల్లో హింసకు సహకరించే వారిని, రాళ్లు విసురుతున్న వారిని, హింసకు పాల్పడుతున్న వారిని పోలీసులు చూసీ చూడనట్లు వదిలేసినట్లు ఉంది.
- హింస సమయంలో రహదారిపై గాయపడిన యువకులపై పోలీసులు దాడి చేయటం, వారిని జాతీయ గీతాన్ని పాడాలని బలవంతం చేస్తున్న వీడియో బయటపడింది.
- అల్లర్ల సమయంలో నిరసనకారులపై చర్యలు తీసుకోకుండా ఓ భాజాపా నాయకుడి పక్కన డీజీపీ నిల్చోని ఉండటం కనిపిస్తోంది.
- డీసీపీ, అదనపు కమిషనర్, ఎస్‌హెచ్‌ఓతో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారుల ప్రమేయం ఉందని పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు.
- భాజపా నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారు.
- సీఏఏ వ్యతిరేక నిరసనలు కుట్రగా చిత్రీకరించటం వల్లే అల్లర్లు జరిగాయి.
- దర్యాప్తుపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పలేం.
- శాంతి భద్రతలపై ప్రజల్లో నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. అందుకోసం విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి.