దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం లేకుండా పార్లమెంటు సమావేశాలకు ఎలా న్యాయం జరుగుతుందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శశి థరూర్.
'ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను అణచివేయడానికి కరోనాను ఓ సాకుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయం లేదని ఆలస్యంగా చెవిలో చావు కబురు చెప్పినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. సభ్యుల భద్రత పేరుతో దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని థరూర్ ట్వీట్ చేశారు.
"పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆక్సిజన్ లాంటిది. అయితే ఈ ప్రభుత్వం పార్లమెంటు అధికారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అణిచివేతకు మెజారిటీని రబ్బరు స్టాంపుగా ఉపయోగించుకుంటుంది."
- శశి థరూర్, కాంగ్రెస్ నేత
ప్రజాసామ్యాన్ని హత్య చేసి మహమ్మారిపై నిందమోపుతున్నారని మోదీ సర్కారుపై మండిపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్.
"పార్లమెంటు పని వేళలు సాధారణంగా ఉన్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎందుకు రద్దు చేశారు? పార్లమెంటు సమావేశాలకు 15 రోజుల ముందు ఆయా సభాపతులకు మంత్రులు ప్రశ్నలు సమర్పిస్తారు. ఇప్పుడా అవకాశం లేకుండా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును ప్రతిపక్షాలు కోల్పోవడం 1950 తర్వాత తొలిసారి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాడానికి కరోనా ఓ సాకు మాత్రమే."