దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చర్చించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానిచటంపై విమర్శలు గుప్పించాయి విపక్ష పార్టీలు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రధాని అసత్యాలు చెబుతున్నారని ఆరోపించాయి.
మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి..
మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ప్రభుత్వ ప్రణాళిక గురించి పార్లమెంటు సంయుక్త సమావేశం ప్రసంగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు పవార్. ప్రధాన పాలసీని తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ స్థాయిలో దానిపై చర్చ జరుగుతుంది.. చర్చ లేకుండా దేశం ముందుకు రాలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపడతామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లు గుర్తు చేశారు.
దేశ ప్రజలను మోసగిస్తున్నారా?..
ప్రధాని మోదీ దేశవ్యాప్త ఎన్ఆర్సీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్సీని భాజపా పేర్కొందని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారని పేర్కొంది. కానీ.. దానికి విరుద్ధంగా ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించింది. ప్రధాని, హోంమంత్రి మధ్య సామరస్యం లేదా? అధికారం, సంస్థల మధ్య విభేదాలు ఉన్నాయా? లేదా ఇద్దరు కలిసి దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.