ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఘోర పరాజయం పాలైంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ఎన్నికలతో భాజపాకు ప్రజలు సరైన సమాధానమిచ్చారని పేర్కొన్నారు పలువురు నేతలు.
హేమంత్పైనే ప్రజల నమ్మకం..
పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో.. తమ ఆకాంక్షలను హేమంత్ సోరెన్ నేరవేరుస్తారని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి గెలుపునకు పాటుపడిన వారికి, హేమంత్ సోరెన్‌కు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు దీదీ.
ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేక తీర్పు..
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సీఏఏ, ఎన్ఆర్సీలకు అనుకూలంగా భాజపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేసినా ఓటర్లు వాటిని ఆమోదించలేదన్నారు. ఝార్ఖండ్‌లో సరైన పాలన అందించకపోవటంతోనే ఓటమి పాలైదని విమర్శించారు.
భాజపా అజేయమైందేమి కాదు..
భాజపా అజేయమైందేమి కాదని.. కాషాయపార్టీని ఓడించడానికి విపక్షాలన్నీ కలిసిరావాలని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ.. కాషాయపార్టీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఝార్ఖండ్ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి అఖండ విజయం అందించిన ఝార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి జయభేరి