సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం విపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగంపై లోక్‌సభలో చర్చించాలని పట్టుబట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. లోక్‌సభలోని వివిధ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంకే నేత టీఆర్ బాలు వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు.. బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీని నిర్వహించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరపాలని విపక్ష నేతలు ఓం బిర్లాను కోరినట్టు బాలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
మరోవైపు సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని విపక్షాలు హామీనిచ్చినట్టు ఓం బిర్లా వెల్లడించారు. సభా సమయాన్ని పూర్తి స్థాయిలో నేతలు ఉపయోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.