కేరళలో శతాబ్దాల కాలం నాటి కళలు, నృత్యాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. వీటిలో అనాదిగా వస్తున్న పూరమ్, పులికాళి తరహాలోనే 'కుమ్మత్తికాళి' నృత్యం త్రిస్సూర్ జిల్లాలో నేటికీ కనిపిస్తోంది.
ఓనమ్ వేడుకల్లో అలనాటి 'కుమ్మత్తికాళి' కళకళలు - ఓనమ్
కేరళ వ్యాప్తంగా ఓనమ్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నెల ఒకటిన మొదలైన ఉత్సవాలు.. 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఓనమ్‌లో భాగంగా త్రిస్సూర్ జిల్లాలో పురాతన నృత్యమైన 'కుమ్మత్తికాళి' స్థానికులను విశేషంగా అకట్టుకుంటోంది.
'ఓనమ్' పండుగలో భాగంగా దాదాపు 60 కుమ్మత్తికాళి నృత్య బృందాలు చేసే నాట్యం అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టం. నృత్యకారులు.. కృష్ణ, నారద, శివుడు, కాళీ, గణపతి, హనుమాన్ సహా వివిధ పౌరాణిక వేషధారణల్లో ఇంటింటికీ వెళ్లి నృత్యం చేస్తారు. అనంతరం స్థానికులు అందించే కానుకలు స్వీకరిస్తారు.
త్రిస్సూర్‌లో వ్యవసాయ పరికరమైన 'కుమ్మత్తికాళి' అనే కర్రను పట్టుకుని కళాకారులు నాట్యం చేస్తారు. అందుకే ఈ నృత్యానికి 'కుమ్మత్తికాళి' అనే పేరు వచ్చింది. ముఖాలకు చెక్కతో తయారు చేసిన ముసుగులను ధరిస్తారు. స్థానిక 'కుమ్మత్తి పుల్ల' గడ్డితో తయారు చేసిన వస్త్రాలు వేసుకుంటారు. చుట్టూ డప్పు వాద్యాలతో వచ్చే సంగీతంతో నృత్యకారులు వేసే చిందులు స్థానికులను ఎంతో ఉత్సాహపరుస్తాయి.