కొవిడ్-19 నుంచి కోలుకొని.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యే వారి విషయంలో మార్గదర్శకాలను సవరించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. హెచ్ఐవీ బాధితులు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి డిశ్చార్జి అయ్యే ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
లక్షణాల తీవ్రత స్వల్పం, మధ్యస్థంగా ఉన్నవారు వైద్యపర్యవేక్షణలో ఉండాల్సిన సమయాన్ని తగ్గించింది కేంద్రం. తాజా మార్పుల వల్ల వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిపై అధిక శ్రద్ధ వహించేందుకు, వారికి సరైన సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుందని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
డిశ్చార్జికి సంబంధించి బాధితులను చాలా తక్కువ, మధ్యస్థం, తీవ్రం... ఇలా 3 కేటగిరీలుగా విభజించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం...
తక్కువ లక్షణాలుంటే...
స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితులకు 3 రోజుల పాటు జ్వరం లేకుంటే.. లక్షణాలు తగ్గిన 10 రోజులకు డిశ్చార్జి చేయవచ్చు. సాధారణ ఉష్ణోగ్రత పరీక్షలు, ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తారు. డిశ్చార్జికి ముందు ఎలాంటి టెస్టులు అవసరం లేదు. ఇంటికెళ్లాక .. 7 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి.
- ఏ సమయంలోనైనా.. డిశ్చార్జికి ముందు బాధితుల ఆక్సిజన్ స్థాయిలు 95 శాతం దిగువకు పడిపోతే.. వారిని ప్రత్యేక కొవిడ్ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు.
- డిశ్చార్జి అయిన తర్వాత ఎవరికైనా.. జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు తిరగబెడితే కొవిడ్ సంరక్షణ కేంద్రం లేదా 1075 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి.
- టెలీకాన్ఫరెన్స్ ద్వారా 14వ రోజు వరకు ఆరోగ్య సిబ్బంది వారిని పర్యవేక్షిస్తారు.
మధ్యస్థంగా ఉన్న బాధితులకు...
మధ్యస్థ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిపై వరుసగా పదిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది. బాధితులు ఎవరైనా 3 రోజుల్లోగా లక్షణాలు తగ్గిపోయి, తర్వాతి 4 రోజులు 95 శాతానికిపైగా ఆరోగ్యంగా ఉంటే వారి శరీర ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తారు. లక్షణాలు కనిపించని 10 రోజులకు వీరిని డిశ్చార్జి చేయవచ్చు.
- వీరికీ వెళ్లేముందు ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. సూచించిన మార్గదర్శకాల ప్రకారం.. ఇంటికెళ్లిన తర్వాత వారం రోజుల పాటు గృహ నిర్బంధం తప్పనిసరి.
- ఆక్సిజనేషన్పై చికిత్స తీసుకునే బాధితులకు.. 3 రోజుల్లోపు జ్వరం తగ్గకుండా, ఆక్సిజన్ థెరపీ అవసరముంటే లక్షణాలు తగ్గాకే పంపిస్తారు.
తీవ్రంగా ఉంటే...
చివరగా కరోనా తీవ్రంగా ఉన్న, రోగ నిర్ధరణ తక్కువ ఉన్న బాధితులు ముఖ్యంగా హెచ్ఐవీ రోగులు, అవయవ మార్పిడి చేసుకున్న వారు క్లినికల్ రికవరీ ఆధారంగానే డిశ్చార్జి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.
ఈ కరోనా బాధితులకు లక్షణాలు పూర్తిగా తగ్గిన అనంతరం.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశాకే డిశ్చార్జి చేస్తారు.