తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త సొమ్ముపై మొదటి భార్యకే అర్హత: హైకోర్టు - Money

బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు భార్యలు ఉన్న సందర్భంలో.. చట్టం ప్రకారం భర్తకు చెందిన సొమ్మును పొందేందుకు మొదటి భార్యకే అర్హత ఉంటుందని వెల్లడించింది. అయితే.. ఇరువురి సంతానానికి ఆ సొమ్మును పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఆర్​పీఎఫ్​ ఏఎస్​ఐకి ప్రభుత్వం అందించే పరిహారం విషయంలో ఈ మేరకు వ్యాఖ్యానించింది.

Only first wife entitled to claim husband's money: HC
భర్త సొమ్ము పొందేందుకు మొదటి భార్యకే అర్హత: హైకోర్టు

By

Published : Aug 26, 2020, 4:57 PM IST

ఇద్దరు భార్యలకు ఆస్తి పంపకం విషయంలో బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు భార్యలు ఉంటే.. చట్టం ప్రకారం భర్తకు చెందిన సొమ్మును పొందేందుకు మొదటి భార్యకు మాత్రమే అర్హత ఉంటుందని పేర్కొంది. అయితే.. ఇరువురికి పిల్లలుంటే వారందరికీ ఆ డబ్బును తీసుకునేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

రైల్వే పోలీసుకు అందే పరిహారానికి సంబంధించిన కేసులో ఈ మేరకు వ్యాఖ్యానించింది జస్టిస్​ ఎస్​జే కథవల్లా నేతృత్వంలోని ధర్మాసనం.

కొవిడ్​-19 పరిహారంతో..

మే 30న కరోనాతో మహారాష్ట్ర రైల్వే భద్రతా దళంలో ఏఎస్​ఐగా పనిచేస్తోన్న సురేశ్​ హటాంకర్​ ప్రాణాలు కోల్పోయారు. విధుల్లో ఉండి కరోనా కారణంగా మరణించిన పోలీసులకు రూ.65 లక్షల పరిహారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ పరిహారం తమకే ఇవ్వాలని హటాంకర్​ ఇద్దరు భార్యలు ప్రభుత్వానికి విడివిడిగా విన్నవించారు.

ఆ తర్వాత రెండో భార్య కుమార్తె శ్రద్ధ హైకోర్టును ఆశ్రయించారు. నిరాశ్రయులైన తనను, తన తల్లిని కాపాడేందుకు పరిహారంలో సరైన వాటా ఇవ్వాలని కోరారు.

హటాంకర్​ అంశం కోర్టుకు చేరిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం ఎవరికి ఇవ్వాలని కోర్టే నిర్ణయించాలని కోరుతూ.. సంబంధిత నగదును న్యాయస్థానానికే అందిస్తామని ధర్మాసనానికి తెలిపింది. ఇద్దరు భార్యల విషయంలో గతంలో ఔరంగాబాద్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది.

హటాంకర్​ మొదటి భార్య శుభద, ఆమె కుమార్తె సురభి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన భర్తకు మరో భార్య, కూతురు ఉన్నట్లు తమకు తెలియదని తెలిపారు. అయితే.. వారికి పూర్తి వివరాలు తెలుసునని వాదించారు శ్రద్ధ తరఫు న్యాయవాది. గతంలో ఫేస్​బుక్​లో ఇరువురు భార్యలు మాట్లాడుకున్నట్లు చెప్పారు. హటాంకర్​ రెండో భార్యతోనే ఉండేవారని, వారి కుమార్తె ధారావిలోని రైల్వే క్వార్టర్స్​లోనే ఉందని తెలిపారు న్యాయవాది. హటాంకర్​ తొలి వివాహం 1992లో, రెండో వివాహం 1998 సమయంలో అయ్యాయని... రెండు పెళ్లిళ్లు రిజిస్టర్​ అయినట్లు చెప్పారు.

ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం మొదటి భార్యకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. అలాగే.. హటాంకర్​కు రెండో భార్య ఉన్నట్లు తెలుసా లేదా అనేది గురువారంలోపు అఫిడవిట్​ దాఖలు చేయాలని మొదటి భార్య, ఆమె కూతురును ఆదేశించింది.

తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: బుల్లి తెరల్లో 'బాల్యం' బందీ.. ఇదే కొనసాగితే కష్టం!

ABOUT THE AUTHOR

...view details