దేశం నలుమూలలా అత్యధికశాతం వంటిళ్లలో ఇప్పుడు ‘ఉల్లిబాంబులు’ పేలుతున్నాయి! మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో టోకు ధరల విపణుల్లోనే కిలో ఉల్లి రేటు వంద రూపాయలకు పైబడటం వినియోగదారుల్ని నిశ్చేష్టపరుస్తోంది. మహారాష్ట్రలోని సోలాపూర్, సంగంనేర్ మార్కెట్లలో రూ.110 ధర పలుకుతుండగా- దక్షిణాదిన కోయంబత్తూర్ వంటిచోట్ల పెద్దఉల్లి కిలో వంద రూపాయలకు, చిన్నపాయలు రూ.130కి చేరి హడలెత్తిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఉల్లి చిల్లర ధర రూ.80కు చేరిందని జాతీయ ఉద్యానమండలి ప్రకటించిన తరవాత రోజుల వ్యవధిలోనే రేటుకు అమాంతం రెక్కలు మొలుచుకొచ్చి ఎక్కడికక్కడ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. హైదరాబాద్, నాగ్‌పూర్, భోపాల్... ఎటు చూసినా ఉల్లి ధరల ప్రజ్వలనం అసంఖ్యాక వినియోగదారుల జేబుల్ని కాల్చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, యూపీ, బిహార్ వంటి ఉల్లిసాగు రాష్ట్రాల్లో జోరువానల ఉరవడి ఈసారి పంట దిగుబడిని బాగా దెబ్బతీసింది.
దిగుమతులతో దారికొచ్చేనా..
అంతర్జాతీయంగా చైనా తరవాత అధికంగా ఉల్లి పండించే దేశం మనదే. విపరీత వర్షాల మూలాన అంచనాలు తలకిందులయ్యాక, దిగుబడి నష్టాన్ని భర్తీచేసి దేశీయంగా సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో- విదేశాలనుంచి లక్ష టన్నుల మేర ఉల్లిగడ్డలు రప్పించనున్నట్లు మూడువారాలనాడు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాసవాన్ వెల్లడించారు. దిగుమతుల బాధ్యతను వాణిజ్య సంస్థ ఎంఎంటీసీకి అప్పగించామని, డిసెంబరు పదిహేనోతేదీ వరకు దేశమంతటా సరఫరాల సంగతి నాఫెడ్ (భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) చూసుకుంటుందని కేంద్రం చెబుతోంది. తాము చెల్లించాల్సిన ధర అధికంగా ఉందంటూ కేంద్రం రాయితీ ఇవ్వాల్సిందేనని రాష్ట్రాలు అభ్యర్థిస్తున్న నేపథ్యంలో- వినియోగదారులకు ఎప్పటికి ఏ మేర ఉపశమనం దక్కేదీ ఊహకందడంలేదు.
ప్రభుత్వ సన్నద్ధతపై శంక!
ఉల్లిధరలు ఘాటెక్కి కొనుగోలుదారుల్ని గంగవెర్రులెత్తిస్తున్న దృశ్యాలు దేశంలో తరచూ పునరావృతమవుతున్నాయి. రెండేళ్ల క్రితం కిలో ఉల్లి ధర రూ.60కి పైబడినప్పుడు శీఘ్ర దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయినట్లు కేంద్రం బహిరంగంగా అంగీకరించింది. ఈ సంవత్సరం సెప్టెంబరునాటి ఉల్లి సంక్షోభానికి ముందే ఏ రాష్ట్రం ఎంత అడిగినా నిల్వలు పంపడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం అభయమిచ్చినా- కోట్లమందికి కడగండ్లు తప్పలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఉల్లిధరలు మరింత భగ్గుమంటున్న వేళ ప్రభుత్వపరంగా సన్నద్ధత తీరుతెన్నులపై ఎన్నో శంకలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ సారి ప్రమాద సంకేతాలను పసిగట్టిన దరిమిలా, ప్రభుత్వం ఎగుమతి రాయితీలను ఉపసంహరించింది. చిల్లర వ్యాపారులు 100 క్వింటాళ్లు, టోకు వర్తకులు 500 క్వింటాళ్ల వరకే నిల్వ చేసుకునేందుకు అనుమతులిచ్చారు. ఈజిప్ట్ వంటి దేశాలనుంచి అత్యవసర దిగుమతులు రప్పించాలని నిర్ణయించారు. తమవంతుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విక్రయాలు ఆరంభించాయి. ఈ తరహా చర్యలు ప్రసాదించగల ఊరట అంతంతమాత్రమే.