కశ్మీర్లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి
సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం దురాగతాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది. మోర్టారు బాంబులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పూంచ్ జిల్లాలోని షాపుర్, కెర్నీ ప్రాంతాల్లోని జనావాసాలపై పాక్ సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిందని.. 120మిల్లీమీటర్ల మోర్టారు బాంబులతో విరుచుకుపడిందని అధికారులు తెలిపారు. పొరుగుదేశం కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ప్రకటించారు.