చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌కు పాకింది. కేరళలో తొలి కేసును నిర్ధరించారు వైద్యులు. వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు తేలినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.
20 నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా.. ఒకటి పాజిటివ్‌గా తేలినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతిని త్రిశూర్ ప్రధానాస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కలకలంతో సదరు విద్యార్థిని భారత్‌కు తిరిగివచ్చిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలన్నారు శైలజ. వారికి గృహ నిర్బంధం తప్పనిసరి అని బోర్డు ఆదేశించినట్లు వివరించారు.