అసోంలో ఆగస్టు 31లోపు జాతీయ పౌర రిజిస్ట్రీ నమోదు పూర్తి చేయాలని కేంద్రం ఎన్ఆర్సీ కమిటీని ఆదేశించింది. గతంలో ఇచ్చిన గడువు జులై 31తో పూర్తయిన నేపథ్యంలో మరో నెల పొడిగించింది కేంద్రం. ఈ నెల 31లోపు రాష్ట్రంలోని పూర్తి పౌర జాబితాతో సిద్ధంగా ఉండాలని సూచించింది.
"గతంలో గడువులో జాబితా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజావసరాల రీత్యా జాబితా పూర్తయ్యేందుకు సమయం అవసరం. ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆగస్టు 31 వరకు గడువును పెంచుతున్నాం. ఆ లోపు తుది జాబితాను అధికారులు సమర్పించాల్సి ఉంటుంది."
- వివేక్ జోషి, భారత ప్రధాన రిజిస్ట్రార్
సుప్రీం ఆదేశాలు
అసోం జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) తుది జాబితాపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తుది జాబితా విడుదల చేసేందుకు గడువును మరో నెల పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. అంతకుముందు 2019 జులై 31నే ఖరారు చేయాలని ఆదేశించిన ధర్మాసనం... తాజాగా 2019 ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అసోం ఎన్ఆర్సీ సమన్వయకర్త ప్రతీక్ హజేలా సమర్పించిన నివేదికలను పరిశీలించిన జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
2018, జులై 30న అసోం ముసాయిదా ఎన్ఆర్సీ జాబితాను ప్రచురించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా జాబితాలో 2.89 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. 40 లక్షల 70 వేల 707 మంది పేర్లు నమోదు కాలేదు. అందులో 37 లక్షల 59 వేల 630 మంది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. 2 లక్షల 48 వేల 077 మంది పేర్లు పెండింగ్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం