జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నడిబొడ్డున రద్దీగా ఉన్న మార్కెట్లో ఉగ్రమూక గ్రనేడ్‌తో దాడి జరిపింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది, మరో 30 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందుకు ప్రతిస్పందనగా ఉగ్రముఠాలు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.